సంక్రాంతికి వచ్చేది ఎవరు ? విశ్వంభర నా ? కాకా నా?

Clash betwen Kaaka and Vishwambhara

విశ్వంభర, కాకా రెండూ చిరంజీవి నటించిన సినిమాలే. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఇరు చిత్ర బృందాలు చెబుతున్నాయి. పైగా, రెండు సినిమాలు సంక్రాంతికే విడుదల అవుతాయని అంటున్నారు. ఖచ్చితంగా రెండు సినిమాలు ఒకేసారి రావు. ఏదో ఒక సినిమానే వస్తుంది. అసలు ఏ సినిమా వస్తుంది?

ముందుగా విశ్వంభరని చూసుకుంటే, సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. అసలు సినిమా 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా. కానీ, దానికి ముందు విడుదల చేసిన టీజర్ చూసి ప్రేక్షకులు తలంటిన విధానానికి చిత్ర బృందానికి తాము చేసిన తప్పు ఎంతో అర్థమైంది. ఆ తర్వాత సినిమా విడుదలను పక్కన పెట్టి, సినిమాకి, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌కి మెరుగులు దిద్దే పనిలో పడ్డారు.

ఆ తర్వాత ఒక పాట విడుదల చేశారు. అది అంతంత మాత్రంగానే ఉంది. జనాలు కూడా మూడు రోజులు విని మర్చిపోయారు. తర్వాత కొన్నాళ్లకు హీరో చిరంజీవి పుట్టినరోజున ఒక టీజర్ విడుదల చేశారు. మొదట్లో విడుదల చేసిన టీజర్‌తో పోల్చుకుంటే ఈ టీజర్ బాగుందనే ప్రశంసలు వచ్చాయి.

దర్శకుడు వశిష్ట ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలను బట్టి చూస్తే సినిమాలో విషయం ఉందనే అనిపిస్తుంది. అయితే, మాటల్లో చెప్పినంత విషయాన్ని తెరపై చూపిస్తారా అనేదే అందరి సందేహం.

కాకా విషయానికి వస్తే, ఇది దర్శకుడు బాబీకి చిరంజీవితో రెండో చిత్రం. వాల్తేరు వీరయ్య కాంబో కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. చిరంజీవి పుట్టినరోజుకి విడుదలైన టీజర్‌కి మంచి స్పందనే వచ్చింది. వీళ్లు సినిమా మొదలైనప్పటి నుంచి సంక్రాంతి 2026 అనే చెబుతున్నారు. మొదటి పాటను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారని సమాచారం.

అయితే, అసలు చిక్కంతా విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా తీసి చాలా రోజులు అయిపోతుంది. వెంటనే విడుదల చేసేయాలి. లేకపోతే సినిమా విలువ తగ్గిపోతుంది. నిర్మాతకు వడ్డీలు పెరిగిపోయి నష్టం వచ్చేస్తుంది.

కానీ, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం సరైన నిర్ణయమేనా? లేదంటే, పిల్లలను ఆకట్టుకునే ఫాంటసీ అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేసవి కాలంలో విడుదల చేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కాకాను పక్కన పెట్టి విశ్వంభరని సంక్రాంతికి విడుదల చేస్తే సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం.

కానీ, కాకా కూడా పండుగ సినిమానే. సంక్రాంతికి విడుదల చేస్తేనే బాగుంటుందని కాకా బృందం పట్టుబడుతుందని, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి మా సినిమానే సంక్రాంతికి విడుదల చేయాలని విశ్వంభర బృందం కూడా అంటుందని సమాచారం.

తుది నిర్ణయం హీరో చిరంజీవి చేతిలో ఉంటుందని అందరూ అంటున్నారు. మరి మెగా అభిమానులకు, ప్రేక్షకులకు చిరంజీవి రాబోయే సంక్రాంతికి సినిమా చూపిస్తారో చూడాలి మరీ!

Spread the love

Leave a Reply