Singanamala Ramesh Babu vs Bandla Ganesh
శింగనమల రమేష్, ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమమలో పేరు మోసిన నిర్మాత. ఆయన పోకిరి, పులి, ఖలేజా లాంటి పలు ప్రముఖ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని, నేరారోపణలు ఎదుర్కొన్నారు. ఈ మధ్యనే కోర్టు ఆయన మీదున్న కేసులు కొట్టేయడంతో ఆయన ఈరోజు ఉదయం పరిశ్రమలోకి తన రీ ఎంట్రీని ప్రకటించడానికి ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ ప్రెస్ మీట్ లో తను ఇప్పటిలా ఒకప్పుడు సినిమాలు సంవత్సరాల తరబడి తీసేవారు కాదనీ, 6 నెలలు, 9 నెలలు మహా అయితే ఒక సంవత్సరంలో సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేవారని అన్నారు. అయితే తన పవన్ కళ్యాన్, మహేష్ బాబులతో తీసిన పులి, ఖలేజా సినిమాలు సంవత్సరాల తరబడి తీయాల్సి వచ్చిందని, దాని కారణం హీరోలే అన్నారు. సంవత్సరాల తరబడి సినిమాని తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని దాని వల్ల నేను 100 కోట్ల దాకా నష్టపోయానని అన్నారు. కనీసం నేను జైల్లో ఉన్నప్పుడు వారిలో ఏ ఒక్కరు కూడా పరామర్శించలేదని నిర్మాత శింగనమల రమేష్ అన్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనికి నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ “సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమా ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కల్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష్య సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్దంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అని అన్నారు.”
తనకి సినిమా షూటింగ్ సరిగ్గా ప్లాన్ చేసుకోవడం రాకపోవడం వలనే అంత ఆలస్యమయిందని, దానికి హీరోలని నిందించడం సరికాదని కొందరు అంటుంటే, 40 కోట్లు నష్టమొచ్చిన సినిమాలకి 100 కోట్లు నష్టమొచ్చిందని చెప్పడం ఏంటని ప్రశ్నించే పాత్రికేయులు పరిశ్రమలో లేకపోవడం దురదృష్టకరమని మరికొందరు అన్నారు.
q5nrgv