అల్లు అర్జున్ ని ఒంటరిని చేసేసారు
సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మీద ఎట్టకేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సంఘటన గురించి, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తన అభిప్రాయాలని పంచుకున్నారు.
పత్రిక కథనాల ప్రకారం, ఆ సంఘటన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. థియేటర్ యాజమాన్యం మరియు అల్లు అర్జున్ టీం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో, ప్రతి ఒక్క హీరోకి తన సినిమాని థియేటర్లో అభిమానుల మధు కూర్చుని చూడాలని, వాళ్ళ స్పందన తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి హీరోకి తన అభిమానులకి అభివాదం చేయాలని ఉంటుంది, దీన్లో అందరూ బన్నీని ఒంటరిని చేసేసారు.”
“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకి, టికెట్ ధరల పెంపుకి అవకాశమిచ్చారు”
“అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. పోలీసులని కూడ నేను తప్పుబట్టను, భద్రతా విషయంలోనే వాళ్ళు ఆలోచించి వ్యవహరిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందె చెప్పాల్సింది. సీట్లో కూర్చున్నాక అయిన, చెప్పి తీసుకెళ్ళాల్సింది”
“అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు వెళ్ళి భాదితురాలు రేవతి కుటుంబాన్ని ఎవరో ఒకరు పరామర్శించి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉంది. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడిని దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమా చూడటానికి వెళ్ళేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్ కు వెళ్ళేవారు” అని పవన్ కల్యాణ్ అభిప్రాయబడ్డారు.